నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది.
అయితే.. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. మంటలు ఎలా వచ్చాయనే దాని గురించి తెలుసుకునేందుకు అధికారులు విచారణను ప్రారంభించారు. కాగా.. గతేడాది శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కూడా ఇలాగే మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ నాగార్జునసాగర్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.