ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా చేయండి..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By Srikanth Gundamalla
ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా చేయండి..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నాలుగో దశ పోలింగ్‌లో తెలంగాణతో పాటు ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం పది రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం అధికారులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఎన్నికల సిబ్బంది అయిన బీఎల్‌వోలు మాత్రమే కాదు.. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీ నేతలు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. చాలా వరకు ఓటరు స్లిప్‌లు అందుతున్నా.. కొందరికి మాత్రం ఇంకా ఇవి చేరలేదు.
ఓటరు స్లిప్ లేకపోతే తాము ఓటు వేయడానికి అర్హులము కాదని కొందరు భావిస్తుంటారు. కానీ.. ఓటర్ స్లిప్ లేకపోయినా ఓటు వేయొచ్చని విషయం చాలా మందికి తెలియదు. అయితే.. కచ్చితంగా తమకు ఓటర్ స్లిప్ కావాలనుకుంటే.. దాన్ని ఎవరికి వారే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. ఓటరు సమాచారంతో కూడిన ఈ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈసీ సులభమైన విధానాన్ని రూపొందించింది. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత వివరాలను నమోదు చేసి ఓటర్ స్లిప్‌ను పొందవచ్చు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సంబంధిత పోలింగ్ బూత్‌లో చూపిస్తే ఓటు వేసుకోవచ్చు. మరో విధంగా కూడా ఓటర్ స్లిప్‌ను సులభంగా పొందవచ్చు. ఈసీఐ స్పేస్ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి 1950కి SMS చేయడం ద్వారా కేవలం కొద్ది సెకన్లలోనే ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది.
ఓటర్ స్లిప్‌పై ఓటరు పూర్తి పేరు.. వయసు, లింగం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ పేరు.. పోలిండ్ రూమ్ నెంబర్, పోలింగ్ తేదీతో పాటుగా సమయం ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఓటర్ వివరాలను అన్నింటిని పొందవచ్చు.