125 ఏళ్ల నాటి ముర్గీ చౌక్‌ పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభం

మహబూబ్ చౌక్ మార్కెట్ అని కూడా పిలువబడే 125 ఏళ్ల చరిత్ర కలిగిన ముర్గీ చౌక్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి సమగ్ర పునర్నిర్మాణ

By అంజి  Published on  9 Jun 2023 7:00 AM GMT
Murgi Chowk, Hyderabad, GHMC, restoration

 125 ఏళ్ల నాటి ముర్గీ చౌక్‌ పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభం

హైదరాబాద్: మహబూబ్ చౌక్ మార్కెట్ అని కూడా పిలువబడే 125 ఏళ్ల చరిత్ర కలిగిన ముర్గీ చౌక్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి సమగ్ర పునర్నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ముఖ్యమైన మైలురాయిగా ఉన్న మార్కెట్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పునరుద్ధరణ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. ముర్గీ చౌక్ భవిష్యత్తు గురించిన ఆందోళనలపై ట్విట్టర్‌లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందిస్తూ.. కొత్త ముర్గీ చౌక్ దాని అసలు నిర్మాణ డిజైన్ అంశాలను అలాగే ఉంచుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.

"ముర్గి చౌక్ ప్రస్తుతం ఉన్న స్థితిలో శిథిలావస్థకు చేరుకుంది. నివాసయోగ్యంగా లేదు. కొత్త ముర్గీ చౌక్‌లో అదే నిర్మాణ రూపకల్పన అంశాలు ఉంటాయి. ఒకసారి పూర్తయితే, ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంటుంది" అని అరవింద్ కుమార్ అన్నారు. రూ.36 కోట్ల అంచనా వ్యయంతో ముర్గి చౌక్ మార్కెట్ పునరుద్ధరణ ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టనున్నాయి. పునరుద్ధరణలో భాగంగా నాన్‌వెజ్‌ మార్కెట్ కోసం G+1 భవనం నిర్మించబడుతుంది. ఇందులో మొదటి అంతస్తులో రెస్టారెంట్ ఉంటుంది.

VI నిజాం, మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో ముర్గీ చౌక్ యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిందని చరిత్రకారులు హైలైట్ చేస్తారు. VI నిజాం ప్రధానమంత్రి సర్ వికార్-ఉల్-ఉమ్రా ద్వారా మాంసం విక్రయానికి ప్రత్యేక ప్రాంతాన్ని ఉండాలని తన ఆలోచనను బయట పెట్టారు. సంవత్సరాలుగా, ముర్గీ చౌక్ హైదరాబాద్ యొక్క సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా మారింది. గత డిసెంబర్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పునర్నిర్మాణ ప్రణాళికలను ప్రకటించారు.

ముర్గీ చౌక్ పునరుద్ధరణ ఒకటిన్నర సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోని వ్యాపారులను సమీపంలో ఇతర ప్రాంతానికి తరలించారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పర్యవేక్షణలో ముర్గీ చౌక్, మీర్ ఆలం మండి, సర్దార్ మహల్ యొక్క వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు ఇటీవల హైదరాబాద్‌లోని మొజ్జామ్ జాహీ మార్కెట్, క్లాక్ టవర్, బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్ వంటి చారిత్రక కట్టడాల విజయవంతమైన పునరుద్ధరణ ప్రాజెక్టులు స్ఫూర్తినిచ్చాయి.

Next Story