సోషల్ మీడియా యూజర్లు..ఎన్నికల వేళ తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికల వేళ సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 11:41 AM IST
EC,  social media, elections, Telangana,

సోషల్ మీడియా యూజర్లు..ఎన్నికల వేళ తస్మాత్‌ జాగ్రత్త..!

ఇది డిజిటల్‌ కాలం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. అంటే అందరి ముందు ప్రపంచం ఉన్నట్లే. ఎక్కడేం జరిగినా క్షణాల్లో ఫోన్‌లోకి వచ్చేస్తుందన్నమాట. అయితే.. ప్రస్తుతం దేశంలోని ఐదురాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగింది. దాంతో.. నాయకులు సోషల్‌ మీడియాను కూడా ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. సోషల్‌ మీడియా ద్వారా అయితే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే లెవల్‌లో నష్టాలూ ఉన్నాయి. మంచి కోసం వాడుకుంటే ఎలాంటి నష్టం లేదు కానీ.. అసభ్యకర పోస్టులు పెడితే... అభ్యంతకర కామెంట్లు పెడితే మాత్రం ఎన్నికల వేళ చర్యలు తప్పవట.

రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచార కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేస్తున్నారు. దాంతో.. ఈ ప్రచారాలను అణువణువునా పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాన్ని ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్, పోలీస్‌ సిబ్బంది, సోషల్‌ మీడియా నిపుణులు సహా పలువురు సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా ప్రసంగాలు, విమర్శలు చేస్తూ పోస్టులు పెడితే నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. క్షణాల్లో వదంతులు సృష్టించి వ్యాప్తిచేసే యూట్యూబర్లపై అధికారులు కన్నేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై నిఘా పెంచారు. చేతిలో ఫోను ఉంది కదా అని సోషల్‌ మీడియా వేదికల్లో అసభ్యకరంగా.. అభ్యంతరకరంగా.. లేదంటే గొడవలకు దారితీసేలా కామెంట్స్‌ చేసినా సరే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో పలువురు ఇరుకున్న సంగతి చెబుతున్నారు పోలీసులు. సోషల్‌ మీడియాలో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టామని.. ఇక నుంచి కింద కామెంట్స్‌ పెట్టినవారిపై కూడా నిఘా పెడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అందుకే నెట్టింట పోస్టు పెట్టి.. లేదంటే ఎవరో పోస్టులకు కామెంట్‌ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలని పోలీసులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

Next Story