డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్‌ శనివారం కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 4:15 AM GMT
Dharmapuri Srinivas, death, cm Chandrababu, cm revanth reddy,

డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్‌ శనివారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు వరకు పార్టీ నేతలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచునున్నారు. ఇక ఆ తర్వాత నిజామాబాద్ పట్టణానికి తరలించనున్నారు. ఇక ఆదివారం మధ్యాహ్నం డీఎస్ సొంత నియోజకవర్గం ఇందూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

డీఎస్‌ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి డీఎస్‌ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోసించారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన పార్టీకి విశిష్ట సేవలందించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక డీఎస్‌ పార్థివ దేహానికి కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు.. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. డీఎస్‌ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారని.. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

డీఎస్‌ మరణం పట్ల సంతాపాన్ని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ధర్మపురి శ్రీనివాస్‌ మరణ వార్త తనని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తి డీఎస్ అని చెప్పారు. మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

కాగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డీఎస్‌కు రెండో కుమారుడు. ఆయన ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నారు.. మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు అర్వింద్ వస్తారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆదివారం డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story