ఏపీని పట్టించుకోని బీజేపీకి రాష్ట్ర పార్టీలెందుకు మద్దతిస్తున్నాయి: షర్మిల

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పోరాటానికి సిద్ధం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 6:46 AM GMT
delhi, ys sharmila,  sharad pawar, special status ,

ఏపీని పట్టించుకోని బీజేపీకి రాష్ట్ర పార్టీలెందుకు మద్దతిస్తున్నాయి: షర్మిల

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పోరాటానికి సిద్ధం అయ్యారు. హోదాతో పాటు రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ ఢిల్లీలో దీక్షకు కూర్చొంటున్నారు షర్మిల. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని వినతిపత్రం అందజేశారు.

ఈ మేరకు మాట్లాడిన వైఎస్ షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల కోసం పోరాటంలో భాగంగా శరద్‌ పవార్, ఎంపీ తిరుచ్చి శివను కలిశామని చెప్పారు. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని మోదీ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని వైఎస్ షర్మిల అన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఇంత వరకు కార్యరూపం దాల్చేలేదని వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా దేవుడెరుగు కానీ..ప్రత్యేక ప్యాకేజీ అన్నారు అదీ ఇవ్వలేదంటూ కేంద్రంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. బుందేల్‌ ఖండ్‌ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌ను ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఇలా ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయకపోయినా.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని పార్టీల నేతలను కలవడంతో పాటు లేఖలు రాస్తామనీ.. చట్టాన్ని గౌరవించి ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అసవరం ఉందరి వైఎస్ షర్మిల అన్నారు.

Next Story