ఇవాళ్టితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ.. నెక్ట్స్ ఏంటి..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
By Srikanth Gundamalla Published on 23 March 2024 2:48 AM GMTఇవాళ్టితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ.. నెక్ట్స్ ఏంటి..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే చర్యలను తీసుకుంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ.. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మరోవైపు కవిత కస్టడీ విచారణ కొనసాగుతుండగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం డిల్లీ లిక్కర్ స్కాం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యనేతలను వరుసగా అరెస్ట్ చేస్తుండటంతో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే.. లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఈ కేసులో పురోగతి గురించి ఈడీ అధికారులు కోర్టుకు వివరించనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కవిత ఈడీ కస్టడీ పొడగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. గత ఆరు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు సహా ఇతర ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, ముఖాముఖిగా కవిత నుంచి వివరాలను సేకరిస్తున్నారు ఈడీ అధికారులు.
లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా ఈడీ ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితను కలిపి విచారించేందుకు ఈడీ అధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. కవితతో పాటుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.