బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డి
హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా సంస్థ ఏప్రిల్ 3, 2021 నుండి నవంబర్ 8, 2023 మధ్య ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 March 2024 3:35 AM GMTబీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన శరత్ చంద్రారెడ్డి.. మొత్తం రూ. 52 కోట్లకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి అందులో సగానికి పైగా భారతీయ జనతా పార్టీకి పంపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం భారీగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు శరత్ చంద్రారెడ్డి.
హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా సంస్థ ఏప్రిల్ 3, 2021 నుండి నవంబర్ 8, 2023 మధ్య ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రూ. 34.5 కోట్లు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రూ. 15 కోట్లు, తెలుగుదేశం పార్టీకి (టీడీపీ)కి రూ. 2.5 కోట్లు విరాళంగా అందించారు. వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉన్నందున అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన పి శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఐదు రోజుల తర్వాత.. నవంబర్ 15, 2022న రూ. 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు.
కంపెనీ దీనిపై ఇంకా స్పందించలేదు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, నవంబర్ 21, 2022న బీజేపీ ఈ మొత్తాన్ని ఎన్‌క్యాష్ చేసింది. గత ఏడాది జూన్‌లో, ఢిల్లీ కోర్టు అనుమతించడంతో శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. ఎక్సైజ్ కేసులో ప్రమేయం ఉన్న వ్యాపార యజమానులు, రాజకీయ నాయకులతో కలిసి కుట్ర పన్నడం ద్వారా మద్యం పాలసీ నుండి అనవసర ప్రయోజనం పొందేందుకు అన్యాయమైన మార్కెట్ పద్ధతులకు పాల్పడ్డాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
నవంబర్ 8, 2023న కంపెనీ రూ. 25 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. వీటిని నవంబర్ 17, 2023న బీజేపీ క్యాష్ చేసింది. దానికి ముందు జనవరి 5, 2022న, అరబిందో ఫార్మా రూ. 3 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది, వీటిని బీజేపీ ఎన్‌క్యాష్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అరబిందో ఫార్మా కేసును హైలైట్ చేసి, ఇప్పుడు రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం "హఫ్తా వసూలి" (దోపిడీ)లో మునిగిపోయిందని, ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన 21 సంస్థలు CBI, ED, IT దర్యాప్తును ఎదుర్కొంటున్నాయని తెలిపారు.