లిక్కర్‌ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 2:46 PM IST
delhi, liquor case, Kavitha, bail petition,

 లిక్కర్‌ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కవిత తరఫు న్యాయవాదులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాగా.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. ఇక జూన్ 7వ తేదీన చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నట్లు కోర్టుకు వివరించింది. మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈకేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి ఈడీ సంస్థ చెప్పిన విషయాలను కోర్టుకు కవిత తరఫు లాయర్ వివరించారు. ఆదివారం సాయంత్రంలోగా కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక సోమవారం రెండు కేసుల్లో కవిత తరఫు వాదనలను పూర్తి చేయాలని న్యాయస్థానం సూచించింది. ఇక మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు. ఇరు పక్షాల వాదనల తర్వాత బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే దానిపై ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది.

మార్చి 16న లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ విచారణ ముగిసిన వెంటనే ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.

Next Story