బేబీ కేర్ సెంటర్‌లో మంటలు.. ఆరుగురు శిశువులు మృతి

దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 3:15 AM GMT
delhi, baby care center, fire accident, six babies dead,

బేబీ కేర్ సెంటర్‌లో మంటలు.. ఆరుగురు శిశువులు మృతి

దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ బేబీ కేర్‌ సెంటర్‌లో శనివారం రాత్రి 11.32 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఆరుగురు నవజాత శిశువులు మరణించినట్లు అధికారులు చెప్పారు. అయితే.. బేబీకేర్‌ సెంటర్‌ భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.

ఇక మంటలను ఆర్పేసిన సిబ్బంది 12 మంది నవజాత శిశువులను రక్షించారని అధికారులు చెప్పారు. కానీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇక ఈ సంఘటనలో గాయపడ్డ మరో ఐదుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బేబీ కేర్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదేకాక ఢిల్లీలో మరో అగ్నిప్రమాద సంఘటన చోటుచేసుకుంది. షహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం మంటలు చెలరేగాయి. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఐదు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఇక భవనంలో చిక్కుకున్న 13 మంది ఫైర్ సిబ్బంది రక్షించారు. మరోవైపు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కూడా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భారీ మంటల్లో చిక్కుకుని 27 మంది చనిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉండటం అందరిలో విషాదాన్ని నింపింది. సంగారెడ్డిలో కూడా స్క్రాప్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. దేశంలో వరుసగా జరిగిన అగ్నిప్రమాద సంఘటనలు కలవరాన్ని సృష్టించాయి.


Next Story