Hyderabad: లులు మాల్‌ను ఊడ్చేసిన నగరవాసులు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో పరువు పాయే!

కూకట్‌పల్లిలో ఇటీవల ప్రారంభమైన లులు మాల్‌కు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. కొందరు కస్టమర్లు మాల్‌లోని ఫుడ్‌ను లాగించేశారు.

By అంజి  Published on  5 Oct 2023 6:22 AM GMT
Crowd management, Hyderabad, Kukatpally, Lulu mall

Hyderabad: లులు మాల్‌ను ఊడ్చేసిన నగరవాసులు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో పరువు పాయే!

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో సెప్టెంబర్‌ 27వ తేదీన అతి పెద్ద ఇంటర్‌నేషన్‌ షాపింగ్‌ మాల్‌ లులు గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభమైన నాటి నుండి ఈ షాపింగ్‌ మాల్‌కు జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మాల్‌కు పెద్ద సంఖ్యలో జనం పొటెత్తుతున్నారు. ఇటీవల వరుసగా ఒకేసారి సెలవులు రావడంతో మాల్‌కు జనం ప్రవాహం పోటెత్తింది. లులూ మాల్‌కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనం భారీగా రావడంతో మాల్‌ కిక్కిరిసిపోయింది. మాల్‌ బయట వాహనాలను పెద్ద సంఖ్యలో పార్కింగ్‌ చేయడంతో కూకట్‌పల్లి ప్రధాన రోడ్లు రద్దీగా మారాయి. కొందరైతే కూకట్‌పల్లి ఫ్లైఓవర్‌పైనే వాహనాలు పార్క్‌ చేశారు. ఇక మాల్‌లోకి పెద్ద సంఖ్యలో కస్టమర్లు రావడంతో మాల్‌ సిబ్బంది నివ్వెరపోయారు. బిల్లింగ్ కౌంటర్లు, ఎస్కలేటర్లు పూర్తిగా జనాలతో నిండిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు మాల్‌లో అందిన కాడికి దోచుకున్నారు.

సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఆహార పదార్థాలను లాగించేశారు. మాల్‌లో ఉన్న ప్యాక్‌డ్‌ ఫుడ్‌ మొత్తాన్ని కస్టమర్లు తినేశారు. సమోసాలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, లేస్‌.. ఇలా ఏది దొరికితే అది లాగించేశారు. షాపింగ్ చేస్తున్నప్పుడు, మాల్‌లోని ఆహార పదార్థాలకు డబ్బు చెల్లించకుండా ప్రాంగణం నుండి బయలుదేరేటప్పుడు భారీ గుంపులో కొంతమంది స్నాక్స్ తింటున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. రాక రాక నగరానికి ఓ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వస్తే.. హైదరాబాద్ వాసులు మన పరువును ఇంటర్నేషనల్ లెవల్‌లో తీశారని కామెంట్లు పెడుతున్నారు. మన నిజ స్వరూపం బయటపెట్టుకున్నామని మరికొందరంటుగా.. పోనీలే బ్రో.. బాగా ఆకలి అయ్యిందేమో, అందుకే తినేసి ఉంటారని ఇంకొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇది సరైన విధానం కాదని మెచ్యూడ్‌గా ఆలోచించాలని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి మొదటి వారంలోనే లులు మాల్‌ను నగరవాసులు లూటీ చేశారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ కిరణ్ సాహూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'ఫుడ్‌హడ్'లో వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో 24 గంటల్లో 2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. అన్ని వయసుల వారు ఉచిత ఆహారంలో మునిగి తేలుతున్న దృశ్యాన్ని "బాధాకరమైనది"గా వర్ణించారు. "షాపింగ్‌కు వచ్చి వారు మొదట్లో వెనుకాడారు, కానీ ఇతరులు అలాంటి ప్రవర్తనలో నిమగ్నమవ్వడాన్ని చూసినప్పుడు వారు దానిని అనుసరించారు" అని సాహూ చెప్పారు. ఈ చర్యల గురించి మాల్ యొక్క ఫ్లోర్ మేనేజర్‌కు తెలియజేసినప్పుడు, అతను గుంపును నిర్వహించడంలో ఇబ్బందులను ఉదహరిస్తూ.. "మేము వారిని ఆపితే, వారు మాపైకి వస్తారు" అని పేర్కొన్నాడు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఇబ్బందికర పరిస్థితిని అడ్డుకోలేకపోయారు. సమోసాలు, బిస్కెట్లు, శీతల పానీయాలు, పండ్లు వంటి వస్తువులను పూర్తిగా లేదా పాక్షికంగా వినియోగించి, ఆపై మాల్ ఫ్లోర్‌లో పడేశారు. సీసాలు, రేపర్లు మరియు ఇతర ఆహార సంబంధిత ప్యాకేజింగ్‌లు అస్తవ్యస్తంగా అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి.

Next Story