తెలంగాణలో రహదారులను ఆధునీకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 4:45 PM ISTతెలంగాణలో రహదారులను ఆధునీకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. హస్తిన టూర్‌లో ఆయన బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ఇందులో భాగంగా 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండలో ట్రాన్స్‌పోర్టు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అలాగే నల్లగొండ నగరానికి బైపాస్ రోడ్ నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సీఐఆర్‌ఎఫ్ ఫండ్స్ పెంపుదలపై విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్-శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-కల్వకుర్తి రహదారిని నలుగు వరసలుగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే రీజినల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం అభివృద్ది పనులు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడంపై నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ సహా ఇతర అంశాలపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. అలాగే.. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి బృందం.