చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు మైనస్ అవుతుంది: రాజాసింగ్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తొలిసారి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 3:30 PM ISTచంద్రబాబు అరెస్ట్ జగన్‌కు మైనస్ అవుతుంది: రాజాసింగ్
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబు వ్యవహారం గురించి తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తొలిసారి స్పందించారు. చంద్రబాబు అంటే ఏపీ సీఎం జగన్‌కు భయం మొదలైందని అన్నారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
రామానాయడు స్టూడియోస్‌లో జరిగిన రజాకార్ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించారు. బంతిని బలంగా కిందకు కొడితే అంతే ఫోర్స్‌తో పైకి లేస్తుందని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రానుందని రాజాసింగ్ జోస్యం చెప్పారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం ప్రస్తుత సీఎం జగన్‌కు మైనస్ అవుతుందని.. చంద్రబాబుకి మాత్రం ప్లస్‌గా అవుతుందని చెప్పారు. ముందు నుంచి చంద్రబాబుపై ప్రజల్లో సేవకుడు అన్న మంచి పేరు ఉందని.. వచ్చే ఎన్నికల్లో అదే చంద్రబాబుని సీఎంని చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన నిర్బంధాలు పెడుతున్నా.. వాటిని ఎదుర్కొని మరీ ప్రజలు రోడ్లపైకి వస్తున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొంటున్నా ప్రజలు అనూహ్యంగా రోడ్లపైకి రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు రోజురోజకు పెరుగుతున్నాయని రాజాసింగ్ అన్నారు. మరో వైపు తెలంగాణలో కూడా నిరసనలు పెరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం, సత్తుపల్లిలో ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. తాజాగా నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ వంటి చోట్ల కూడా ప్రజలు స్వచ్చందంగా ర్యాలీలు నిర్వహించారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.