నటిపై వ్యాఖ్యల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది.
By Knakam Karthik
ఆమెపై వ్యాఖ్యల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. ప్రముఖ సినీనటి మాధవీ లతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆ ఈవెంట్‌ను కండక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవీ లత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ మాధవీలతపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆమెను సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు మాధవీ లతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి టీడీపీ అధిష్టానం ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలతకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తీవ్ర భావోద్వేగానికి లోనైన మాధవీ లత, జేసీపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 21న సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ క్షమాపణ చెప్పిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం చర్ఛనీయాంశంగా మారింది.