ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 March 2024 9:28 AM ISTఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆమె నివాసంలో ఈడీ అధికారులు మొదట సోదాలు చేశారు. తనిఖీలు ముగిసిన తర్వాత తగిన కారణాలతోనే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు నిరసనల మధ్య ఎమ్మెల్సీ కవితను ఈడీ అదికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి కవితను ఈడీ అధికారులు తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు వద్ద కవిత మీడియా కంటపడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇతర గేటు నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అక్కడే వైద్యులు కవితకు పరీక్షలు నిర్వహించారు. పరివర్తన్ భవన్ వద్ద ప్రస్తుతం 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు, ఈడీ అదికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందురోజే కవిత అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాజకీయ కక్ష సాధింపే అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసే బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మండిపడుతున్నారు.
ఇక ఎమ్మెల్సీ కవితను ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెడతారు. న్యాయస్థానం విచారణ తర్వాత కవితను ఈడీ కస్టడీకి ఇస్తాదా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారనీ ఆరోపిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాదుల బృందం బెయిల్ పిటిషన్‌ను రెడీ చేస్తున్నారు.