తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ - జేపీ నడ్డా
By - Nellutla Kavitha | Published on 5 May 2022 9:21 PM ISTతెలంగాణ లో బీజేపీ వికసించబోతోందని, తెలంగాణ లో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని అన్నారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. బండి సంజయ్ పాదయాత్ర 22వ రోజుకు చేరుకున్న సందర్భంగా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్ర కు ప్రజల ఆశీర్వాదం ఉందని, మోడీ ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటాయి, ఉన్నాయి కూడా అన్నారు నడ్డా.
మోడీ ది బాధ్యత కలిగిన ప్రభుత్వమని, కరోనా సమయంలో అమెరికా, జెర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఏమీ చేయలేకపోయాయని, అదే సమయంలో ప్రజల సహకారం తో కరోనాను ఎదుర్కొన్నామని, 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదే అన్నారు నడ్డా.
కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ATM అయిందని, పాలిచ్చే గేదె అయిందన్నారు నడ్డా. తెలంగాణ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే, డబుల్ లాభం అవుతుందని, హరితహారం లో అవినీతి, ల్యాండ్ మాఫియా, ఇలా ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని అన్న నడ్డాతెలంగాణ రాజాకార్ సమితి అని అభివర్ణంచారు.
కేంద్ర నిధులతో వచ్చిన కేంద్ర పథకాలను కేసీఆర్ తన పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నాడని అన్నారు. బండి సంజయ్ పాదయాత్రను చూస్తే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం గా అర్థం అవుతోందని, ఇక్కడ సభలో చూస్తే ప్రజల్లో జోష్ కనిపిస్తోందని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.