రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలి: రాజాసింగ్
రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 9:37 AM ISTరూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలి: రాజాసింగ్
అయోధ్యలో రామమందిర నిర్మాణం కొనసాగుతోంది. ఈ నెల 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాల కరెన్సీపై హిందూ దేవతల ఫొటోలు ఉన్నాయని రాజాసింగ్ గుర్తు చేశారు. ఇక ఇండోనేషియాలో ఏకంగా 80 శాతం ముస్లింలు ఉన్నారు.. అలాంటిది అక్కడి కరెన్సీపై హిందూ దేవతల ఫొటోలు ఉన్నాయని ఎప్పార. మన దేశంలో కూడా రూ.500 నోటుపై రాముడి ప్రతిరూపం ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.500 నోటుపై శ్రీరాముడి ఫొటోను ముద్రించాలనేది తన ఒక్కడి డిమాండ్ మాత్రమే కాదనీ.. దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల కోరిక అని చెప్పారు. కాగా.. మహారాష్ట్రలోని శంభాజీపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ కామెంట్స్ చేశారు.
దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను విడుదల చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. దేశ విభజన సమయంలో ఇక్కడి జనాలను హతమార్చిన వారి ఆస్తులను కాపాడేందుకు నెహ్రూ సర్కార్ వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. మహారాష్ట్రలో 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉందన్నారు. 2009 వరకు అది 4 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది.. కానీ అక్రమంగా దాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచారని ఆరోపించారు. ఈ భూములను మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.