భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 8:30 AM GMT
Bhadrachalam, Godavari Flood, Telangana, Rains,

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భారీ వర్షానికి రామాలయం పరిసరాల్లో కూడా నీరు చేరింది. దాంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్నదాన సత్రం వద్దకు కూడా వరద నీరు చేరడంతో.. అన్నదాన కార్యక్రమాన్ని అధికారులు నిలుపుదల చేశారు.

గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. 24 గంటలు పని చేసేలా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో కార్యలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూడు, పినపాక తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. భద్రాచలం వద్ద వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క ప్రాణికి హాని కలగకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. వరద నీరు చేరే వరకు ఆగకుండా ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు దాటే ప్రయత్నాలు కూడా చేయొద్దని అధికారులు చెబుతున్నారు. అవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

కాళేశ్వరం త్రివేణీ సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9.980 మీటర్ల నీటి మట్టం నమోదు అయ్యింది. వరద ఇంకా వస్తోన్న క్రమంలో నీటిమట్టం మరింత పెరగనుంది.

నిరంతరాయంగా కురుస్తోన్న వర్షాలతో పలు చోట్ల పనులకు ఆటంకం కలుగుతోంది. జనజీవనం కూడా అస్తవ్యస్తం అవుతోంది. తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారం వెళ్లే రహదారిపై కేశవాపుర్, పెగడపల్లి మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులను దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story