హైదరాబాద్‌లో ‘ఫార్ములా -ఈ’ రేసు రద్దు

హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఇ ఈవెంట్‌ రద్దయింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jan 2024 5:11 AM GMT
formula-e, race, cancelled,  hyderabad,

హైదరాబాద్‌లో ‘ఫార్ములా -ఈ’ రేసు రద్దు 

హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఇ ఈవెంట్‌ రద్దయింది. కొత్త తెలంగాణ ప్రభుత్వం నుండి సరైన సమాచారం రాకపోవడంతో ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఇ మేనేజ్‌మెంట్ ధృవీకరించింది. "ఫిబ్రవరి 10వ తేదీ శనివారం షెడ్యూల్ చేసిన హైదరాబాద్ ఇ-ప్రిక్స్ రద్దు చేశామని.. సీజన్ 10 క్యాలెండర్‌కు సరికొత్త అప్డేట్ ను ఇస్తాము" అని హోస్టింగ్ కంపెనీ X లో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రేసును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. రేసుకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న ఈ రేసు జరగాల్సి ఉంది. రేసు రద్దు కావడంపై ఫార్ములా-ఈ కోఫౌండర్, చీఫ్ ఛాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో మాట్లాడుతూ.. ఈ విషయంపై చాలా అసంతృప్తికి గురవుతున్నామని చెప్పారు. ఇండియాలో మోటార్ స్పోర్ట్ కు చాలా ఫ్యాన్ బేస్ ఉందని, రేసు రద్దు కావడం బాధాకరమని అన్నారు. ఒక అఫీషియల్ మోటార్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించడం హైదరాబాద్ కే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమని చెప్పారు.

రేసు ఫిబ్రవరి 10న జరగాల్సి ఉంది. ఇది బహుళ-సంవత్సరాల ఒప్పందంలో భాగం. “ఫార్ములా E ఆపరేషన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్‌కు అధికారికంగా నోటీసు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. FEO దాని స్థానం, హోస్ట్ సిటీ ఒప్పందం, ఇతర చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తోంది" అని ఫార్ములా-ఈ ఒక ప్రకటన పేర్కొంది.

ఫార్ములా E, CEO, జెఫ్ డాడ్స్ మాట్లాడుతూ "గత సంవత్సరం రేసు భారీ విజయాన్ని అందుకుంది. రేసు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతానికి దాదాపు 84m USD ఆర్థిక ప్రభావం చూపించింది. ప్రజారోగ్యం, పర్యావరణంపై భారీ ప్రభావాన్ని చూపే మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడానికి హైదరాబాద్‌లో రేసింగ్ ముఖ్యమైనది." అని తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (MAUD), రేసును నిర్వహించేందుకు అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడం లేదని ఫార్ములా Eకి తెలియజేసింది. ఫార్ములా E రాబోయే సీజన్‌ను 10 ఈవెంట్‌లలో 16 రేసులకు తగ్గించింది తప్పితే.. హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌ను భర్తీ చేయడం లేదని ధృవీకరించింది.

గత వారంలో, ఫార్ములా ఇ ఫిబ్రవరి 10న జరగాల్సిన రౌండ్‌తో ముందుకు సాగడం సాధ్యం కాదని చెబుతూ ఆందోళనలను వ్యక్తం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఐటి మంత్రి కెటి రామారావు ఆధ్వర్యంలో రేస్ జరిగింది. అయితే ఇటీవలి రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది.

Next Story