తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

By -  Nellutla Kavitha |  Published on  31 March 2022 12:31 PM GMT
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

నేర చరిత్ర ఉన్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పదవులు ఇవ్వడం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరిత్ర కలిగిన వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి వాదనలు ఏప్రిల్ 19న వింటామని పేర్కొంది.

టిటిడి బోర్డు సభ్యులలో క్రిమినల్ కేసులు నమోదైన వారు ఉన్నారని, ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఎక్కువమంది ఉన్నారని పిటిషన్ నమోదయింది. పిటిషనర్ తరఫు లాయర్ అశ్విని కుమార్ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని, కనీసం కొంత మందిని అయినా తొలగించాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు వివరాలను ధర్మాసనానికి అశ్విని కుమార్ వివరించారు. దీంతో నేరచరితులను ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా, ఎప్పుడూ లేనంతగా యాభై మందిని నియమించారు. జంబో పాలకవర్గ ఏర్పాటుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 19న తదుపరి వాదనలు వింటామని, అదేరోజు నిర్ణయం కూడా తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపులు ఉండవు అని కోర్టు స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న వారిని నియమించడం లబ్దికోసం అనే భావిస్తున్నామని హైకోర్టు అభిప్రాయపడింది. టీటీడీ భవనాన్ని కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే విధానపరమైన నిర్ణయం కాబట్టే సమర్ధించామని, అయితే నేర చరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గం లో ఉండకూడదని హైకోర్టు తెలిపింది.

Next Story