దీపావళి సంబరాలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

AP Government Key Decision diwali celebrations I దీపావళి పండగ వచ్చేస్తోంది. టపాసులతో మోత మోగిపోతుంది. కరోనా

By సుభాష్  Published on  11 Nov 2020 3:41 AM GMT
దీపావళి సంబరాలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

దీపావళి పండగ వచ్చేస్తోంది. టపాసులతో మోత మోగిపోతుంది. కరోనా మహమ్మారి సమయంలో దీపావళి పండగ సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం.. సర్కార్‌ చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో కరోనా బాధితులను దృష్టిలో ఉంచుకుని, కాలుష్యం ఏర్పడకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. టపాసులు అమ్మకాలపై కూడా కొన్ని నిషేధాలు విధించింది. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి షాపు మధ్య 10 అడుగుల దూరం ఉండేలా పాటించాలని సూచించింది. షాపుల వద్ద కొనుగోలు దారులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించింది. అలాగే ప్రతి షాపుల వద్ద శానిటైజర్లు తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయంతో రాష్ట్రాలు అప్రమత్తం

కాగా, కాలుష్యాన్ని, కరోనాను దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల కిందట నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునరల్‌ టపాసులపై సంపూర్ణ నిషేధం విధించింది. ఇక దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తం అయ్యాయి. దీపావళి బాణాసంచాతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబర్‌ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్‌ 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునరల్‌ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేకాకుండా గత ఏడాది నవంబర్‌లో గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆ ప్రాంతాల్లో మాత్రమే టపాసులు విక్రయించాలి

ఇక గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. దీపావళి, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో బాణసంచా కాల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంతో కోవిడ్‌ వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల బాణాసంచాలపై నిషేధం విధించింది. ఇకదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో హరిత టపాసులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా టపాసులు అమ్మకాలు, కాల్చుకోవడంపై ఆదేశాలు జారీ చేసింది.


Next Story