ఇవాళ ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు పయనం
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 16 July 2024 7:39 AM ISTఇవాళ ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు పయనం
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్తుండటం గమనార్హం. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం అవుతారు. రాత్రికి ఢిల్లీలో బస చేస్తారు. ఆ తర్వాత రోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. విభజన సమస్యలను పరిష్కరించాలని అమిత్‌షాను చంద్రబాబు కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతర రాజకీయ అంశాలపై కూడా అమిత్‌షాతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో పర్యటించారు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాన మంత్రికి నివేదించారు. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరారు. ఇక రెండు వారాల వ్యవధిలోనే మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.