అమెరికాలో రోడ్డు ప్రమాదం, భారత్‌కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:00 AM ISTఅమెరికాలో రోడ్డు ప్రమాదం, భారత్‌కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ విశ్వవిద్యాలయానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతులను అరవింద్ మణి, అతని భార్య ప్రదీపా అరవింద్, వారి కుమారుడు ఆండ్రిల్‌గా గుర్తించారు పోలీసులు. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో కారు ప్రమాదానికి గురి అయ్యింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పింది. ఆ తర్వాత మరో కారును బలంగా ఢీకొట్టింది. దాంతో.. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో కొడుకును వదిలిపెట్టేందుకు కారులో వెళ్తున్నారు అరవింద్ దంపతులు. కారు టైరు పేలి ప్రమాదం జరగడంతో ముగ్గురు చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాగా.. అరవింద్ మణి, ప్రదీప దంపతులకు మరో కుమారుడు కూడా ఉన్నాడు. సోదరుడు, అమ్మానాన్నలు చనిపోవడంతో మరో కుమారుడు ఆదిర్యాన్ ఒంటరివాడై పోయాడు. ఈ సంఘటన అందరి హృదయాలను కలచివేస్తోంది. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు చనిపోవడం పట్ల అక్కడి ప్రవాస భారతీయులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.