వెనక నుంచి ఢీకొట్టిన కారు.. అమెరికాలో తెలంగాణ యువతి మృతి

తాజాగా అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 10:46 AM GMT
America, road accident, Telangana  girl,

వెనక నుంచి ఢీకొట్టిన కారు.. అమెరికాలో తెలంగాణ యువతి మృతి

విదేశాల్లో చదువుకోవాలని చాలా మంది యువత కలలు కంటారు. ఆ కలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక విదేశాల్లో మంచి కాలేజ్‌లో సీటు సంపాదించుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అవుతారు. అయితే.. భారత్‌కు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఫారెన్ కంట్రీస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబందించి మరణవార్తలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రమాదాలతో చనిపోతే.. ఇంకొన్ని సార్లు దారుణహత్యలకు గురయ్యారు.

తాజాగా అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందని యువతి ప్రాణాలు కోల్పోయింది. న్యూయార్క్‌లో రోడ్డుపై యువతి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. దాంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య (25)గా తెలిసింది.

సౌమ్య పుట్టిన ఊరు, తల్లిదండ్రులను వదిలేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతోంది. సౌమ్య చదువుకుంటూనే.. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ తన అవసరాలను తానే తీర్చుకుంటోంది. ఇంటి వద్ద తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తుంది. అయితే.. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా ఒక కారు వచ్చి యువతిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో.. యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్పాట్‌లోనే సౌమ్య ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సౌమ్య మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన విషాదాన్ని నింపింది.

Next Story