వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు భాగ్యరాజ్
By - Nellutla Kavitha | Published on 21 April 2022 6:00 PM ISTదేశంలో మోడీ సాగిస్తున్న సుపరిపాలన చూస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా తప్పకుండా గర్వించే వారని మోదీని అంబేద్కర్ తో పోలుస్తూ ఇటీవలే ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే తమిళ నటుడు భాగ్యరాజ్ మోదీని పొగుడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి మోడీ లాంటి ప్రధానమంత్రి అవసరమని అంటూనే, మోదీకి ఉన్న ఎనర్జీ తనకి నచ్చుతుంది అంటూ భాగ్యరాజ్ చెన్నైలోని బీజేపీ ఆఫీస్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి.
చెన్నై లోని బీజేపీ ఆఫీస్ లో ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న భాగ్యరాజ్ మోదీని వ్యతిరేకించే వాళ్ళంతా ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటూ, వాళ్లంతా మూడు నెలలలోపే పుట్టిన వాళ్లుగా అభివర్ణించారు భాగ్యరాజ్. తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు నాలుగు నెలల్లో నోరు ఏర్పడుతుందని, 5వ నెలలో చెవులు ఏర్పడతాయని, మోదీని వ్యతిరేకించే వారికి నోరు, చెవులు ఉండవ్ అంటూ వ్యాఖ్యానించారు భాగ్యరాజ్. అందువల్లే మోదీ కి సంబంధించి ఏ విధమైన పాజిటివ్ వ్యాఖ్యలు చేయరని, దాంతో పాటు గానే మోడీ చేసిన మంచి పనులు వారికి వినిపించవు అని అన్నారు భాగ్యరాజ్. నోరు,చెవులు లేకుండా మోడీని విమర్శించే వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
భాగ్యరాజ్ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేట్టుగా ఉన్నాయని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నటుడు భాగ్యరాజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ రావడంతో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. ప్రీమెచ్యూర్ బేబీస్ కి, దివ్యాంగుల కి ఏవిధమైన సంబంధమూ లేదని, తాను దివ్యాంగుల పట్ల ఎప్పుడూ జాలి, దయతోనే వ్యవహరిస్తానని అన్నారు. అయినప్పటికీ తన వ్యాఖ్యలు దివ్యాంగులను బాధించినట్లయితే క్షమాపణ కోరుతున్నానని భాగ్యరాజ్ ప్రకటించారు. తాను బిజెపి కార్యకర్త కాదని, అయితే తమిళనాడులోనే పుట్టి పెరిగిన తన నరనరానా పెరియార్ తోపాటుగా కరుణానిధి, ఎంజీఆర్ భావజాలమే ఉంటుందని, ద్రవిడియన్ పద్ధతిలోని సినిమాలు తీశానని, అదే కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చారు భాగ్యరాజ్.