ఏడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత 3,800 ఓట్లకు పైగా వెనుకబడిన పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ మంగళవారం పార్టీ కార్యకర్తలకు "కృతజ్ఞతలు" తెలియజేసారు. అలాగే "ప్రజల తీర్పును" అంగీకరిస్తున్నట్లు చెప్పారు. 37 ఏళ్ల ఇల్తిజా ముఫ్తీ తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీలో ఉన్నారు.
ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె అయిన ఇల్తిజా ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బహీర్ అహ్మద్ వీరీపై 3,788 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇంకా ఐదు రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది.
‘‘ప్రజల తీర్పును నేను అంగీకరిస్తున్నాను. బిజ్‌బెహరాలో అందరి నుండి నేను పొందిన ప్రేమ, ఆప్యాయత ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన నా PDP కార్యకర్తలకు కృతజ్ఞతలు” అని ఇల్తిజా ముఫ్తీ X లో పోస్ట్ చేశారు.ఇల్తిజా ముఫ్తీ తల్లి మెహబూబా ముఫ్తీ. ఆమె జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలలో పీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం రెండు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.