మూసీ, ఈసీ నదులపై 5 వంతెనలు.. ప్యారిస్ తరహాలో నిర్మాణం
హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్యారిస్ తరహా బ్రిడ్జిల నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
By అంజి
మూసీ, ఈసీ నదులపై 5 వంతెనలు.. ప్యారిస్ తరహాలో నిర్మాణం
హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈసీ, మూసీ నదులపై ఐదు వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వంతెనలను ప్యారిస్ తరహా నిర్మించనున్నారు.హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రజల మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చేందుకు కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ కోర్ సిటీలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నార్సింగి నుంచి గౌరెల్లి వరకు మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రెండేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి కారణంగా మూసీ, ఈసీ నదులపై వంతెనల నిర్మాణ కార్యకలాపాల్లో జాప్యం జరిగింది. దీంతో ట్రాఫిక్ అంచనాలు, కొత్త పరిణామాలను పరిగణనలోకి తీసుకుని మూసీ నదిపై అదనపు వంతెనల ఆవశ్యకతపై అధ్యయనం చేశారు. మూసీ నదిపై నాలుగు లేన్లతో ఐదు వంతెనలను నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.168 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
బుద్వేల్ ఐటీ పార్కు (ఈసీపై) వద్ద రెండు వంతెనలు, మిగిలిన మూడింటిని మంచిరేవుల, హెచ్‌ఎండీఏ లేఅవుట్ ఉప్పల్ భాగ్యత్, ప్రతాప్ సింగారం వద్ద మూసీ నదిపై నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 25న ఉప్పల్ భగాయత్ వద్ద అయిదు వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.168 కోట్ల అంచనా వ్యయంతో ఐదు వంతెనల నిర్మాణ పనులకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. 15 నెలల్లోగా అన్ని హెచ్‌ఎండీఏ వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు, వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మూసీ, ఈసీ నదులపై వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
మూసీ, ఈసీ నదులపై నిర్మించే బ్రిడ్జిలు ప్యారిస్ తరహాలో ఉండనున్నాయి. బ్రిడ్జిలు ప్రత్యేకంగా ఉండేందుకు ప్యారిస్‌లోని బ్రిడ్జిలను పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ అధికారుల బృందాన్ని అక్కడకు పంపించారు. అక్కడి సోయినె నదిపై ఉన్న బ్రిడ్జిలను పరిశీలించిన అధికారుల బృందం హైదరాబాద్ నగరంలోని మూసీ కనుగుణంగా ఇక్కడ ఆధునిక బ్రిడ్జిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
- ఈసీ నదిపై రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు వద్ద వంతెన (180 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.19.83 కోట్ల వ్యయం)
- ఈసీ నదిపై రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు వద్ద వంతెన (196 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ. 20.64 కోట్ల వ్యయం)
- మూసీ నదిపై మంచిరేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి (180 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.32.21 కోట్ల వ్యయం)
- ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద బ్రిడ్జి ( 210 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.29.28 కోట్ల వ్యయం)
- ప్రతాప సింగారం వద్ద బ్రిడ్జి (210 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ. 26.94 కోట్ల వ్యయం)