నకిలీ ఓటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపి
BJP Leaders Meet CEC In Delhi Over Voter Enrollment List
By - Nellutla Kavitha |
టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసిందని, గతంలో ఉప ఎన్నికల్లో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదు కానీ ఈ ఉప ఎన్నికల్లో భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేశారని, వారిని తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు బీజేపి నేతలు.
ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ , మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ రావు దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించారని, మంత్రులు, సెక్రెటరీలని తీసుకువచ్చి అక్కడినుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, అధికారులు భయపెడుతున్నారని కమలనాథులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
గత నాలుగేళ్ల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారని వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు నేతలు. కేంద్ర బలగాలను, ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని తరలించారని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మునుగోడు లోనే పెట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. తప్పకుండా ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారని, మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నేతలు.