కీలకమైన 2023 కేంద్ర బడ్జెట్
How And Why Union Budget 2023 Is Crucial
By Nellutla Kavitha Published on 27 Jan 2023 7:06 AM GMTభారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈనెల 19న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయసభల్లో పార్టీ తరఫున ఎంపీలు అనుసరించిన వ్యూహం గురించి, చర్చించాల్సిన అంశాలపై సీయం కెసిఆర్ వారితో సమావేశంలో చర్చించనున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న కేంద్ర బడ్జెట్ కావడంతో ఈ పార్లమెంటు సమావేశాలు కీలకం కాబోతున్నాయి. దీంతోపాటుగానే ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీగా టిఆర్ఎస్, జాతీయ పార్టీ బిఆర్ఎస్ గా మారిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశాలు కావడంతో బడ్జెట్ సమావేశాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత కొంతకాలంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు నామమాత్రంగానే ఉండడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోవడం, విభజన హామీలు అమలు ఇంకా జరగకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కొరవడింది. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్న ప్రభుత్వం ఈసారి ఉభయసభల్లో గట్టిగానే పోరాడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1న ప్రారంభం కాబోతున్న పార్లమెంటు సమావేశాలు కీలకం కాబోతున్నాయి. అందుకే తన వాయిస్ ని గట్టిగా వినిపించడంతోపాటుగా, కేటాయింపులు సరిగా లేకపోతే నిరసనని కూడా అంతే బలంగా వినిపించడానికి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు సీఎం కేసీఆర్.
కీలకాంశాలు
2024లో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఐదవ సారి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. జనవరి 31న ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1 న 11 గంటలకు నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు బడ్జెట్ సమావేశాలకు విరామం ఉంటుందని, తిరిగి ప్రారంభమయ్యాక ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సంవత్సరం కూడా పేపర్ లెస్ బడ్జెట్ కనిపించింది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశ పెడతారని అంచనా వేస్తున్నారు. ఇక బడ్జెట్ కు ముందు హల్వా వేడుకలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే గత ఏడాది కరోనా కారణంగా కేవలం స్వీట్స్ ను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఈసారి మాత్రం హల్వా వేడుకను నిర్వహించారు. బడ్జెట్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించే అధికారులు, ఇతర ఆర్థిక శాఖ సిబ్బంది సమక్షంలో హల్వా తయారుచేసి, దానిని అందరితో పంచుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది.
ఎన్నో ప్రశ్నలు
మోదీ 2.0 ప్రభుత్వం చివరిసారిగా, అందులోను ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో, ప్రజలకు ఎలాంటి తాయిలాలు ఉండబోతున్నాయి? 140 కోట్ల మంది ప్రజలు ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశించవచ్చు? ఎన్నికల కాలం కాబట్టి కోతలు, వాతలు ఉంటాయా? కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు సరిగా లేవు కాబట్టి, తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? బిజెపి తెలంగాణ మీద పట్టు సాధించాలని భావిస్తోంది కాబట్టి, భారీ కేటాయింపులు ఉండబోతున్నాయా? బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 1 దాకా ఎదురు చూడాల్సిందే.