బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిన పది కీలక అంశాలు

Facts And History Of Union Budget

By -  Nellutla Kavitha |  Published on  31 Jan 2023 6:10 AM GMT
బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిన పది కీలక అంశాలు

రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రసంగించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోందీ బడ్జెట్. ఈ బడ్జెట్ కు సంబంధించి ఆసక్తికరమైన కీలక అంశాలు ఎన్నో ఉన్నాయి.

• భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటీషియన్, ఏకానమిస్ట్ జేమ్స్ విల్సన్ మొట్టమొదటి బడ్జెట్ ను బ్రిటిష్ క్రౌన్ కు 7 ఏప్రిల్, 1860న ప్రతిపాదించారు.

• దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నవంబర్ 26, 1947న మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పారిశ్రామికవేత్త, కొచ్చిన్ రాష్ట్ర మాజీ దివాన్, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌కు రాజ్యాంగ సలహాదారు, ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షణ్ముకం చెట్టి పార్లమెంటులో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

• 1970 -71 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఇందిరా గాంధీ. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. రేపు నిర్మల ఐదవ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

• 1973 - 74 ఆర్థిక సంవత్సరానికి గాను అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను “బ్లాక్ బడ్జెట్” గా అభివర్ణిస్తారు. దీనికి కారణం ఆ బడ్జెట్లో 550 కోట్లతో లోటు బడ్జెట్ ను చూపించడమే. ఆ కాలంలో అదే ఎక్కువ లోటు బడ్జెట్. అందుకే దానిని బ్లాక్ బడ్జెట్ గా పిలిచేవారు.

• కేంద్ర బడ్జెట్ తో పాటుగా రైల్వే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని బ్రిటిషర్లు 1924లో ప్రారంభించారు. అలా రెండు బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయం 2016 వరకు కొనసాగింది. దేశంలోని చివరి రైల్వే బడ్జెట్‌ను 2016 లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమర్పించారు. సాధారణ బడ్జెట్ కు కొన్ని రోజుల ముందు రైల్వే బడ్జెట్ సమర్పించేవారు. అయితే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదనలతో 2017లో మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ ను, ఆర్థిక బడ్జెట్ కు కలిపి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

• 1955 కు ముందు వరకు బడ్జెట్ ప్రతులు కేవలం ఇంగ్లీషులో మాత్రమే లభించేవి. ఆ తర్వాత ఇంగ్లీషు, హిందీలో కూడా అందుబాటులో ఉండేలా చేశారు. • బ్రిటిషర్ల పాలన కొనసాగినంత కాలం, పార్లమెంటు సమావేశాల చివరి రోజు అంటే, ఫిబ్రవరి చివర్లో సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే 1999 లో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానిని ఉదయం 11 గంటలకు మార్చారు. 2017 లో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ వచ్చాక ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ప్రారంభించారు.

• 1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్ లోనే ముద్రించేవారు. అయితే ఆ సంవత్సరం బడ్జెట్ పత్రాలు ముందే లీక్ అయిన కారణంగా మింట్ రోడ్ లోని ప్రెస్ లో ముద్రిస్తున్నారు.

• కరోనా మహమ్మారి కారణంగా 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో పేపర్ లెస్ బడ్జెట్ ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. గత ఏడాది కూడా పేపర్ లెస్ బడ్జెట్ ఉంది.

• 2019 వరకు ఆర్థిక శాఖ మంత్రులందరూ తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసులో తీసుకురావడం ఆనవాయితీగా వచ్చేది. అయితే ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఎర్ర రంగు ఉన్న "Bahi Khata" లో తీసుకు వస్తున్నారు. బహి ఖాతా అంటే అకౌంట్స్ బుక్ అని అర్థం. దీని మీద మన జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది.

• ఇక బడ్జెట్ రూపొందించడం అంతా పూర్తయిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి హల్వా వేడుక చేస్తారు. గతేడాది మాత్రం కరోనా కారణంగా సిబ్బందికి మిఠాయిలు మాత్రం పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది కొద్ది రోజుల క్రితమే హల్వా వేడుక జరిగింది.

Next Story