రేపే రెండో విడత కంటివెలుగుకు శ్రీకారం
Telangana CM KCR Will Launch Secomd Phase Kanti Velugu Along With Other Three CMs Tomorrow
By Nellutla Kavitha Published on 17 Jan 2023 2:11 PM ISTతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని రేపు ఖమ్మంలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమవుతాయి. కంటి వెలుగు మలి విడత శిబిరాల నిర్వహణపై ముందస్తు సమాచారం ప్రజలకు అందజేయాలని, అందుకోసం ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రికను అందించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. నాలుగు నెలల వరకు కంటివెలుగు శిబిరాలు కొనసాగుతాయి. ఇందుకోసం 15 వేల మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు. రాష్ట్రంలో మొత్తం 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేయనున్నారు.ఈ పరీక్షలు చేయించుకోవాలని అనుకునేవాళ్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.కంటి పరీక్షలకు సంబంధించిన పరికరాలు, కళ్లద్దాలు, మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఇక ఖమ్మంలో జనవరి 18న అంటే రేపు జరగనున్న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ రానున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ , ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, CPI ప్రధాన కార్యదర్శి రాజా సీయం కేసీఆర్ తో కలిసి కంటివెలుగు కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన ఆరుగురు లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఈ ఆరుగురు కళ్లద్దాలను అందచేయనున్నారు.
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఏర్పాట్లలో ఉన్న మంత్రి హరీష్ రావు కంటివెలుగు పై ఖమ్మం నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వైద్య, ఇతర శాఖల అధికారులతో మంత్రి హరీశ్‌రావు ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండో విడత కంటి వెలుగును విజయవంతం చేయాలని సూచించారు. శిబిరాలకు అందరూ ఒకేసారి రాకుండా ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చేలా షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. కంటివెలుగు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, వీఆర్‌ఏలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు హరీష్ రావు. 2018లో విజయవంతం అయిందని, అనుకున్న లక్ష్యాలను చేరుకున్నామని ఈసారి కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు మంత్రి.
ఇక రేపు జరుగబోతున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముందు సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఖమ్మం సమీపంలో ఉన్న వి.వెంకటాయపాలెం దగ్గర 25 ఎకరాల్లో 45 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీయం కేసీఆర్‌తోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో కొత్తగా మంజూరైన మెడికల్ కళాశాల ప్రారంభ శిలాఫలకాన్ని వారితో కలిసి ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే రెండో విడత కంటివెలుగుకు శ్రీకారం. మలివిడతగా చేపట్టబోతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని నలుగురు ముఖ్యమంత్రులు, ఇతర అతిథులు ప్రారంభించనున్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోనే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అతిథులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేశారు. భోజనం అనంతరం వారతో కలిసి సీయం కేసీఆర్ బీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరవుతారు.