సీయం జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

British Deputy High Commissioner Meets AP CM

By -  Nellutla Kavitha |  Published on  14 Oct 2022 2:40 PM GMT
సీయం జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్, సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్న విన్‌ ఓవెన్, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు.

యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఇక్కడ కూడా అమలుచేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. అందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్‌ బృందానికి సీఎం వివరించారు. యూకే – భారత్‌ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగగా విన్‌ ఓవెన్‌ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకి బ్రిటీష్‌ బృందం హామి ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వివరించారు. రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్నారు విన్‌ ఓవెన్‌ . విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రికి ఓవెన్‌ బృందం వివరించింది. ఈ సమావేశంలో బ్రిటీష్‌ కమిషన్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Next Story