సీయం కేసీఆర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఎందుకోసం?!
Why Telangana CM KCR Is In Delhi On Sudden Visit?!
By - Nellutla Kavitha |
మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇంత సడన్ గా ముఖ్యమంత్రి కెసిఆర్ హస్తినకు ఎందుకు పయనమయ్యారు అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ తో పాటుగా సీఎస్ సోమేష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి ఉన్నారు.
సోమవారం రాత్రి వరకు ఎవరి అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ ఆకస్మికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా నూతన రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ కలుస్తారని సమాచారం.
దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా, విపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది టీఆరెస్. జూలై మొదటి వారంలో టిఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హా ను హైదరాబాద్ కు ఆహ్వానించి, భారీ ర్యాలీని, సభను కూడా నిర్వహించింది. యశ్వంత్ సిన్హాకు మద్దతు పలకడంతో పాటుగా, నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా కేటీఆర్ తో సహా ఇతర టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని గౌరవిస్తూ, ప్రొటోకాల్ ని పాటిస్తూ, పోటీలో విజేతగా నిలిచిన ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలు గురించి రాష్ట్రపతికి వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున సభలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి ఢిల్లీలోనే ఉండి దిశానిర్దేశం చేయనున్నారు కెసిఆర్. దీనితో పాటు గానే ఇటీవలే పాలు, పాల ఉత్పత్తులు, బ్రెడ్ తో పాటుగా ఇతర నిత్యావసర వస్తువులపై విధించిన GST కి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని దానిపై కూడా వ్యూహరచన చేయనున్నారు. మరోవైపు విపక్ష నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక దేశ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు కోసం విపక్షాలు ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి కెసిఆర్ ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆహ్వానించినట్లు సమాచారం. వీటితోపాటుగానే గతంలో వినిపించిన నట్టుగా కెసిఆర్ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడబోతోందని, అందుకోసం కెసిఆర్ జాతీయ స్థాయి నాయకులతో కూడా చర్చిస్తారని వినిపిస్తోంది. అందుకు ఢిల్లీలోనే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
అయితే నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రం సీయం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చు అంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ అవకాశమే లేదు అంటూ గవర్నర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన లోనే ఉన్నారు. మరి ఢిల్లీలో ఏం జరగబోతోంది? కెసిఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఎలా ఉండబోతోంది!