మహిళా దర్బార్ - సమస్యలకు పరిష్కారం

Telangana Governor TamiliSai SoundaraRajan Holds Mahila Darbar At RajBhavan For The Second Time

By -  Nellutla Kavitha |  Published on  19 July 2022 7:47 AM GMT
మహిళా దర్బార్ - సమస్యలకు పరిష్కారం

తన 23 ఏళ్ళ కూతురు అనూష, ఉద్యోగానికి ఇంటి నుంచి పోయి, కనిపించకుండా పోయింది అని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సిబిఐ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తన కూతురి మిస్సింగ్ వెనక ముగ్గురిపై అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మలక్ పేటకు చెందిన ఒక తల్లి, జయంతి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు.

ఇక తెలంగాణ మహిళా కమిషన్ దగ్గర ఇప్పటికీ రెండు వందల కేసులు పెండింగ్లో ఉన్నట్టుగా జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ అంటున్నారు. ఇదే విషయమై రాష్ట్ర డిజిపి అపాయింట్మెంట్ కోరితే తను నిరాకరించారని రేఖ శర్మ రాజ్భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కొన్ని ఘటనల్లో పోలీసులో మహిళలను వేధించినట్టుగా తమ దృష్టికి వచ్చిందని, ఇక మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారని అంటున్నారు రేఖా శర్మ.

తెలంగాణ రాష్ట్రంలో సహాయం అవసరమైన మహిళలు ఉన్నారని, వారి కోసమే మహిళా దర్బార్ అనే ఒక వేదికను ఏర్పాటు చేశామని, వారు తమ దగ్గరకు వస్తే సమస్యలకు పరిష్కారం చూపుతామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళలకు సహాయం అందించాలనే ఉద్దేశంతోనే రాజభవన్ లో మహిళా దర్బార్ నిర్వహిస్తున్నామని, అవసరమైన మహిళలకు న్యాయ సహకారం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు గవర్నర్. గత నెలలో అంటే, జూన్ పదవ తారీఖున మొట్టమొదటి మహిళా దర్బార్ రాజ్భవన్ లో నిర్వహించారు తమిళిసై. ఆ రోజు నిర్వహించిన మహిళా దర్బార్లో 400 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించడంతో పాటు ఫిర్యాదుదారులతో అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడారని, సమస్యలను పరిష్కరిస్తారని గవర్నర్ తెలిపారు.

ఇక నెల రోజుల తర్వాత నిన్న రెండవ మహిళా దర్బార్ రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించారు. దీంట్లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ కూడా పాల్గొన్నారు. మహిళా దర్బార్ లో భాగంగా గవర్నర్ కు అందిన 41 ఫిర్యాదులకు న్యాయ సహకారం అవసరం ఉంది. తనను కలిసి ఫిర్యాదు చేసిన ఆ మహిళలకు ఉచితంగానే లీగల్ అసిస్టెన్స్ ను అందజేస్తానని భరోసా ఇచ్చారు గవర్నర్. వివాదాస్పదమైన పనులు కాకుండా తాము నిర్మాణాత్మకమైన పనులు చేయాలనుకుంటున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సందర్భంగా అన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ప్రభుత్వం ద్వారా మాత్రమే పరిష్కరించగల కేసులున్నాయని అలాంటి వాటిని ప్రభుత్వానికి బదిలీ చేశామని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదుల్లో వేధింపులు, భద్రత, న్యాయపరమైన కేసులతో పాటుగా ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయని అన్నారు గవర్నర్. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మహిళలకు ఒక్కొక్కరికీ 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

Next Story