రేపటినుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం

Ban On Single Use Plastic From Tomorrow

By -  Nellutla Kavitha |  Published on  30 Jun 2022 5:02 PM IST
రేపటినుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం

ఒక్కసారి వాడుకొని పడేసే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. రేపటి నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఏ రూపంలోనూ వినియోగించరాదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై విధించిన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర పాలిత ప్రాంతాను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.

2021 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలను కచ్చితంగా అందరు అమలు చేయాల్సిందేనని నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం. దీనిని అనుసరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రవాణా, నిల్వ, విక్రయం, వినియోగం ఏ రూపంలో ఉన్నా అనుమతించకూడదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలు కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీచేసింది.

ఇయర్ బడ్స్ కు ఉండే ప్లాస్టిక్ స్టిక్స్, బెలూన్ లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ క్యాండీస్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్ కోసం వాడే ధర్మకోల్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ స్పూన్లు లాంటివి వీటిలో ఉన్నాయి. వీటితోపాటుగా ఆహార పదార్థాల నిల్వ, రవాణా కోసం ఉపయోగపడే ప్లాస్టిక్ కవర్లు ఈ నిషేధిత జాబితాలో వస్తాయి. వీటితోపాటుగా స్వీట్ బాక్స్ లు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ లేదా 100 మైక్రాన్ల కంటే తక్కువ సామర్ధ్యం ఉన్న పివిసి బానర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కేంద్రం కోరింది. అంతర్ రాష్ట్ర రవాణాపై ప్రత్యేక నిఘాతో పాటుగా, రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక అక్రమ తయారీ, ఎగుమతి, దిగుమతులు, నిల్వలు, పంపిణీ, అమ్మకం, వినియోగం మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలను కూడా నియమించారు. ప్రస్తుతం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిన కేంద్రం, ఇక ఈ ఏడాది చివరికి అంటే, డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్ల మందం అన్ని ప్లాస్టిక్ వస్తువులపై కూడా నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే ప్లాస్టిక్ పై నిషేధాన్ని స్వాగతిస్తున్న అప్పటికీ దాన్ని దశలవారీగా చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు తయారీ మీద దాదాపుగా 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, నిషేధం విధించడం వల్ల 10 వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని కఠినంగానే అమలు చేయాలని భావిస్తోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన నిర్ణయం 11 నెలల ముందే తీసుకున్నామని, దేశవ్యాప్తంగా నిషేధపు హెచ్చరిక అప్పుడే చేసామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి మహేందర్ యాదవ్ పరిశ్రమ వర్గాలతో అన్నారు.

ఇక దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన వేళ, ఆజాదీ కా అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలంతా కీలక భూమిక వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం, భౌగోళిక మార్పులు అరికట్టాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉందని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రజల భాగస్వామ్యంతోనే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అరికట్టి, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మహత్తర కార్యం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story