సార్ మా పిల్లి బావిలో పడింది - కాపాడండి : అర్ధరాత్రి కరీంనగర్ సి.పి.కి ఫోన్ కాల్ - స్పందించిన సిపి

Karimnagar City Police Commissioner Responds To A Call At Midnight At Rescues A Cat

By -  Nellutla Kavitha |  Published on  27 Jun 2022 2:20 PM GMT
సార్ మా పిల్లి బావిలో పడింది - కాపాడండి : అర్ధరాత్రి కరీంనగర్ సి.పి.కి ఫోన్ కాల్ - స్పందించిన సిపి

అర్ధ రాత్రి సమయం 12-00 గంటలు. అప్పుడే కరీంనగర్ సిపి సత్యనారాయణకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి, సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది, దానిని కాపాడడానికి మీ సహాయం కావాలి అందుకే కాల్ చేసానని చెప్పారు. వెంటనే స్పందించిన సిపి, టౌన్ ఏ సి పి తుల శ్రీనివాస రావు కి ఫోన్ చేసి, కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి, ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించారు.

అంతేకాదు వాట్సాప్ లో వారి లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసిపి కి షేర్ చేయడంతో, టౌన్ ఏ సి పి, ఆ ఏరియా లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి, సిబ్బందిని రెస్క్యూ టీం గా ఏర్పాటు చేసి, అర్జంటుగా ఆ స్థలానికి వెళ్లి ఆ పిల్లి ని కాపాడే ప్రయత్నం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు. అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీం బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ఏర్పాటుచేసి, పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించారు.

అర్ధరాత్రి 12:30 - 12:45 మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించగా, ఆ పిల్లి యజమాని ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలపారు. ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి రెండు గంటల కైనా డయల్@100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి, ఆపద నుండి కాపాడతారని, ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తమదంటున్నారు సీపీ.

Next Story