సీయం కేసీఆర్ రేపు వెళ్తారా? లేదా?
Ujjwal Bhuyan Swearing In Ceremony Tomorrow At RajBhawan. Will CM KCR Attend The Program?
By - Nellutla Kavitha | Published on 27 Jun 2022 12:52 PM GMTతెలంగాణలో రేపు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయి. ఒకటి రాజ్ భవన్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం జరగబోతోంది. రెండవది రెండవ దశ టీ హబ్ భవన ప్రారంభ కార్యక్రమం. హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఇక T-Hub రెండవ దశ ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చేయనున్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య విభేదాలు నెలకొన్న నేపద్యంలో ఈ రెండు కార్యక్రమాల మీద ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
రాజ్యాంగం ప్రకారం చీఫ్ జస్టిస్ తో ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నరే. గతంలో రాజ్భవన్లో హిమా కోహ్లీ తో చీఫ్ జస్టిస్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అయితే రేపటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. అయితే రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు ఉన్న విభేదాల కారణంగా గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇక రేపే T-Hub రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ భవనాన్ని పరిశ్రమలు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ముందుగా ప్రచారం జరిగింది అయితే దాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజ్ భవన్లో జరిగే చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం గైర్హాజర్ కావడానికి, వ్యూహాత్మకంగానే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక టీ హబ్ రెండో దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కి ఆహ్వానం అందలేదని సమాచారం. మరి రాజ్భవన్లో రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోయినప్పటికీ ప్రభుత్వ ప్రతినిధిగా ఇతర మంత్రివర్గ సహచరులు ఎవరైనా హాజరవుతారా, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత సీయం, చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా పూర్తయ్యాక మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్లి కీసీఆర్ కలిసి వస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు ఏడాదికాలంగా ప్రగతి భవన్ కి, రాజ్ భవన్ కు మధ్య విభేదాలు అనేవి కనిపిస్తూ వస్తున్నాయి. గవర్నర్ తమిళ సై తన అధికార పరిధిని అతిక్రమించి, వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి ని నామినేట్ చేయాలన్న టిఆర్ఎస్ ప్రతిపాదనను గవర్నర్ పెండింగ్లో పెట్టిన దగ్గర నుంచి, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజభవన్ కే పరిమితం చేయడం, సీఎంతో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం, గవర్నర్ కు ఇవ్వాల్సిన మర్యాద, ప్రోటోకాల్ పాటించడం లేదని బిజెపి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దీనికి తోడు జూలై మొదటి వారంలో బిజెపి కార్యక్రమాలకి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి రావడంలో రాజభవన్ లోనే బస చేస్తారని బిజెపి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.