నేను రాజీనామాకు సిద్ధంగానే ఉన్నా - మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
Maharashtra Chief Minister Uddhav Thackeray On His Resignation
By - Nellutla Kavitha | Published on 22 Jun 2022 1:12 PM GMTమహారాష్ట్రలో క్షణక్షణానికి రాజకీయాలు మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కరోనా బారిన పడడంతో ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
శివసేన పార్టీ ఎప్పుడూ హిందుత్వాన్ని వదిలిపెట్ట లేదని స్పష్టం చేశారు ఉద్ధవ్ ఠాక్రే. హిందూత్వ భావజాలం, హిందుత్వం మా గుర్తింపు, హిందుత్వం మా ఊపిరి అని ఆయన స్పష్టం చేశారు. శివసేన ఎప్పుడు హిందుత్వాన్ని వదిలి పెట్టలేదని, బాలాసాహెబ్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. కరోనా సమయంలో సీఎంగా తన బాధ్యతను నిర్వర్తించానని, తమ కృషికి మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. తనను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నానని, పదవి కోసం వెంపర్లాడడం లేదని, తాను బాలా సాహెబ్ కుమారుడినని, రాజీనామాకు సిద్ధమే అని వ్యాఖ్యానించారు ఉద్ధవ్ ఠాక్రే.
సీఎం పదవి తీసుకోవాలని గతంలో శరద్పవార్ కోరారని, అందుకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, సీఎంగా బాధ్యతను నిర్వర్తించానని, కొందరు ప్రేమతో గెలిస్తే, మరికొందరు కుట్రలతో గెలుస్తారని ఆయన అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటానని, సీఎంగా కొనసాగాలని కూడా లేదని అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. సంకీర్ణ ప్రభుత్వంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే అది వేరని, అలా కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే నేను ఏమనగలనని, శివసేన సైనికులంతా తనతో ఉన్నంత వరకూ భయపడాల్సిన అవసరమే లేదు అని అన్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.