సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనలో ప్రమేయం ఉన్న పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన పదిమందిలో ఐదుగురు వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2 గా ఉన్న పృథ్వీరాజ్ కీలక భూమిక పోషించినట్టు దర్యాప్తులో తేలింది. ఏ1 గా మధుసూదన్ ను పోలీసులు గుర్తించారు.
దాడి ఘటనలో ప్రమేయం ఉన్న వారిని విచారించిన రైల్వే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసిన అనంతరం, రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బోయిగూడా రైల్వే కోర్ట్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపితే ఎలాంటి ఫలితం ఉండదని వాట్సాప్ గ్రూపులో సందేశాలను మధుసూదన్, పృథ్విరాజ్ పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు. వాట్స్అప్ గ్రూపులు ఏర్పాటు చేసి, 17వ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వందలమంది రావాలని ప్రచారం చేశారు. రైల్వే బోగీలకు నిప్పుపెట్టి విధ్వంసం కలిగిస్తూనే, కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్తుందని వాట్సాప్ గ్రూపులలో సందేశాలను పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు.