రేపే ఆత్మకూరు ఉప ఎన్నిక - భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
All Set For Atmakur ByPoll Tomorrow
By - Nellutla Kavitha | Published on 22 Jun 2022 10:25 AM GMTనెల్లూరు జిల్లా ఆత్మకూరులో రేపు ఉప ఎన్నిక జరుగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ప్రధానంగా పోటీ వైసీపీ, బీజేపీ మధ్య నెలకొని ఉంది. టిడిపి గత సంప్రదాయాలను అనుసరించి ఈ ఉప ఎన్నికల బరిలో నిలవడం లేదు.
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2019లో ఆత్మకూరు శాసనసభకు 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. అయితే రేపు ఎంత మేర పోలింగ్ అనేది జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉండగా రెండు లక్షల 13,338 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇక్కడ మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య లక్షా 7 వేల 367 అయితే, పురుష ఓటర్ల సంఖ్య లక్ష 5 వేల 960 గా ఉంది.
మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1132 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మూడు కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలు భద్రత కోసం చేరుకున్నాయి. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు.