ఏపీ పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు
Betterment Exams To SSC Students In AndhraPradesh
By - Nellutla Kavitha |
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసినవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకూ లేని బెటర్మెంట్ అవకాశాన్ని ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కలిగించింది. పదో తరగతి విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ తో పాటే బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీనికితోడు పాస్ అయినవారిలోనూ మార్కులు తక్కువగా వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం బెటర్ మెంట్ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
49 అంత కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఏవైనా రెండు సబ్జెక్టుల్లో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి బెటర్ మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ అవకాశం ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన వారికేనంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్ కు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలని విద్యాశాఖ పేర్కొంది. జూన్ 16 నుంచి 19 లోగా ఆయా స్కూల్స్ లో నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.