ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్రరీ డోస్ కు అనుమ‌తించండి - మంత్రి హరీశ్ రావు

Telangana Health Min Harish Rao Requests Central Govt To Gove Permission For Booster Doses

By -  Nellutla Kavitha |  Published on  13 Jun 2022 3:24 PM GMT
ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్రరీ డోస్ కు అనుమ‌తించండి - మంత్రి హరీశ్ రావు

ప్ర‌భుత్వం అధ్వర్యంలో అర్హులైన వారందరికీ ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ వద్ద 32 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, గడువు తేదీ ముగిసే అవకాశం ఉందని వివరించారు. అర్హులకు ప్రికాషనరీ డోసు ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్త్రక్ క్యాంపెయిన్ -2.o పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనుసుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

దీంతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్ర‌భుత్వ వైద్యంలో ప్ర‌స్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం, 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌స్సున్న‌ వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని గతంలో కేంద్రానికి మంత్రి హరీశ్ రావు రెండు సార్లు లేఖ రాశారు. తాజాగా మరోసారి వేసీలో కేంద్రాన్ని కోరారు.

రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. జూన్ 3 న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికి వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏళ్లు పై బడిన వారికి మొత్తంగా.. మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

కరోనా పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నదని, దానికి అనుగుణంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అర్ టి పీసీఆర్ పరీక్షలు మరింత పెంచనున్నట్లు తెలిపారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పేఖో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని తెలిపారు.

Next Story