కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్లాను : ఉండవల్లి అరుణ్ కుమార్
Undavalli Arun Kumar About Meeting With Telangana CM KCR
By - Nellutla Kavitha | Published on 13 Jun 2022 2:59 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీనియర్ పొలిటికల్ లీడర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను ఉండవల్లి రాజమహేంద్రవరంలో వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయనతో భేటీ అయ్యానని ఉండవల్లి చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను ప్రగతి భవన్‌కు వెళ్లానని చెప్పిన ఉండవల్లి, తనను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్‌తో తన భేటీలో హరీశ్‌తో పాటు మరో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నారని చెప్పారు. తాము చర్చించుకున్నంత సేపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా అక్కడే ఉన్నారని, అయితే ప్రశాంత్ కిశోర్ చర్చలో పాలుపంచుకోలేదని, తాము మాట్లాడుకుంటూ ఉంటే ఆయన విన్నారని అన్నారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బలమైన పార్టీ అని ఉండవల్లి చెప్పారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ భేటీలో రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్న ఉండవల్లి, బీఆర్ఎస్ గురించి మాత్రం ప్రస్తావన రాలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపైనే చర్చ జరిగిందన్నారు. దేశంలో మోదీ పాలనను వ్యతిరేకించే వారిలో కేసీఆరే బలమైన నేతగా ఉన్నారన్నారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని చెప్పిన ఉండవల్లి, ఆ పార్టీ విధానాలతో తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్నట్లుగా మరింత మేర పెరిగితే ప్రమాదమేనని ఉండవల్లి అన్నారు. ఈ విషయంపైనే తాము ప్రధానంగా చర్చించుకున్నామన్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తే చేశారన్నారు. బీజేపీపై కేసీఆర్‌తో పాటు తనదీ ఒకటే అభిప్రాయమని ఆయన చెప్పారు.
ఇక కేసీఆర్‌తో కలిసి తాను మధ్యాహ్న భోజనం చేశానని ఉండవల్లి చెప్పారు. ప్రశాంత్ కిశోర్ కూడా తమతో కలిసి లంచ్ చేశారని ఆయన చెప్పారు. తాను అరగంట మాట్లాడితే కేసీఆర్ రెండున్నర గంటలపాటు మాట్లాడారని ఉండవల్లి చెప్పారు.