క్రికెట్ మ్యాచ్ మ‌ధ్య‌లో వ‌ర్షం వ‌స్తే ఆ రూల్ ప‌క్కా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 April 2020 3:55 AM GMT
క్రికెట్ మ్యాచ్ మ‌ధ్య‌లో వ‌ర్షం వ‌స్తే ఆ రూల్ ప‌క్కా..

క్రికెట్ తెలిసిన వారికి డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌లు ఆగిన‌ప్పుడు, స‌మయాభావం కార‌ణంగా ఓ జ‌ట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించ‌డానికి ఈ ప‌ద్ధతిని వాడుతారు. అయితే ఈ ప‌ద్ద‌తిని ఫ్రాంక్ డ‌క్‌వ‌ర్త్‌, టోనీ లూయిస్ అనే మాజీ క్రికెట‌ర్లు రూపొందించారు. దాని కార‌ణంగానే ఈ ప‌ద్ద‌తికి డ‌క్‌వ‌ర్త్ లూయిస్ అనే పేరు వ‌చ్చింది.

అయితే.. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ సృష్టిక‌ర్త‌ల్లో ఒక‌రైన టోనీ లూయిస్‌ గురువారం క‌న్నుమూశారు. లూయిస్.. ఇంగ్లాండ్ దేశ‌స్థుడు కాగా.. అత‌ని వ‌య‌స్సు 78 సంవ‌త్స‌రాలు. ఈ సంద‌ర్భంగా ఐసీసీ.. క్రికెట్‌కు లూయిస్ చేసిన సేవ‌ల‌ను కొనియాడింది. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది.

ఇదిలావుంటే.. లూయిస్ 9 టెస్టులాడి 457 ప‌రుగులు సాధించారు. అందులో ఒక శ‌త‌కం కూడా ఉంది. ఇక షెఫీల్డ్ యూనివ‌ర్సిటీ నుంచి గ‌ణితం, స్టాటిస్టిక్స్‌లో ప‌ట్టా పొందిన ఆయ‌న‌.. క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథ‌డ్స్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ బ్రూక్స్ యూనివ‌ర్సిటీలో లెక్చ‌ర‌ర్‌గా విధులు నిర్వ‌ర్తించారు. అనంత‌రం బ్రిటీష్‌ ఏంపైర్ మెంబ‌ర్‌గా గౌర‌వం స్వీక‌రించారు.

అయితే.. డ‌క్‌వ‌ర్త్‌, లూయిస్ ఇద్ద‌రూ క‌లిసి సృష్టించిన ప‌ద్ధతిని ఐసీసీ 1999నుండి వాడుతోంది. ఇక 2014 నుంచి ఈ ప‌ద్ధ‌తిని స్టీఫెన్ స్టెర్న్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న పేరుతో క‌లిపి ప్ర‌స్తుతం ఈ మెథ‌డ్‌ను డ‌క్‌వ‌ర్త్ లూయిస్ స్టెర్న్ ప‌ద్ధ‌తిగా పిలుస్తున్నారు. లూయిస్ మ‌ర‌ణంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్య‌క్తం చేసింది. ఆయ‌న క్రికెట్‌కు చేసిన‌ సేవల‌ను కొనియాడింది.

Next Story