మూడు గంటల పాటు ఉరి కంబానికి నిర్భయ దోషులు..!
By సుభాష్ Published on 19 March 2020 2:11 PM GMT2012, డిసెంబర్ 16న దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరి ఖాయమైపోయింది. ఇప్పటి వరకు దోషుల పిటిషన్ల కారణంగా మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడగా, ఇప్పుడు నాలుగో సారి ఉరి ఫిక్సైపోయింది. దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాల వల్ల ఇప్పటి వరకు శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఇక మార్చి 20న ఉరిశిక్ష ఖరారు కావడంతో ఈరోజు వరకు కూడా దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు పిటిషన్లు దాఖలు చేయగా, విచారించిన ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు పిటిషన్లను కొట్టివేసింది. ఇక రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష వేయాలని తీర్పునిచ్చింది.
నలుగురికి ఒకేసారి ఉరి
ఇక నలుగురు దోషులకు ఒకేసారి ఊరితీయనున్నట్లు తెలుస్తోంది. వీరి ఉరి తీతకు తీహార్ జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ దోషులైన అక్షయ్ కుమార్, పవన్, ముఖేష్, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా, 1982లో మైనర్లు సంజయ్ చోప్రా, గీతా కిడ్నాప్ కేసులో దోషులైన బిల్లా, రంగాలను ఒకేసారి ఉరితీశారు. ఇప్పుడు నిర్భయ కేసులో నలుగురిని ఒకేసారి ఉరి తీస్తుండటం దేశ చరిత్రలోనే మొదటి సారి అని చెప్పాలి.
మూడు గంటల పాటు ఉరి కంబానికి..
నలుగురి బరువును మూడు గంటల పాటు ఉరి కంబాలు మోయగలవా? లేవా? అన్ని నిర్దారించటం కోసం తీహార్ జైలు అధికారులు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు కూడా. మెడకు ఉరితాళ్లు గట్టిగా బిగుసుకుపోకుండా ఉండేలా.. దానికి వెన్న రాయనున్నారు. దీంతో తక్కువ నొప్పితో దోషులు మరణించే అవకాశం ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు.
తీహార్ జైల్లో 1950లో ఉరి ప్రాంగణం
ప్రస్తుతం నలుగురు దోషులు తీహార్ జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని1950లో నిర్మించారు. రెండు స్తంభాలను కలుపుతూ మెటల్ బార్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరితాడును కట్టనున్నారు. ఆ తాళ్ల వల్ల మెడ కోసుకుపోకుండా.. గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్న మాట. దోషులను ఉరి తీసే సమయం దగ్గర పడుతుండటంతో ఉరికి సంబంధించిన ఏర్పాట్లలో జైలు అధికారులు బిజీ బిజీగా ఉన్నారు
ఉరితాళ్లను తయారు చేస్తున్న బక్సర్ జైలు ఖైదీలు :
సుప్రీం కోర్టు ఆదేశంతో 10 ఉరి తాళ్లు ఇప్పటికే సిద్దమైనట్లు తెలుస్తోంది. దోషులకు మొదటి సారిగా ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన సమయం నుంచి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలులో ఉన్ ఖైదీలో ఈ ఉరితాళ్లను తయారు చేస్తున్నట్లు ఆ జైలు అధికారులు ఇటీవల వెల్లడించారు. అప్జల్ గురు ఉరి తీసిన తాడును కూడా ఈ జైలు ఖైదీలో తయారు చేశారు. ఉరి తాళ్లను తయారు చేసే వాటిలో ఈ బక్సర్ జైలు ప్రసిద్ధి. ఈ ఉరితాళ్లను తయారు చేసేందుకు ప్రత్యేక తాళ్లను వాడుతుంటారు. ఇక ఏదిఏమైనా నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష ఖరారు కానుంది.