భాస్కరభట్లతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో '2+1'

By అంజి  Published on  26 Nov 2019 9:01 AM GMT
భాస్కరభట్లతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో  2+1

షకలక శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘2+1' చిత్రం కోసం మాస్ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రెండు పాటలు రాస్తున్నారు. కాచిడి గోపాల్ రెడ్డి దర్వకత్వంలో సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకటరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో పక్కా మాస్ బీట్ తో సాగే రెండు పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాస్తున్నారు. సంగీత దర్శకుడు హరిగౌర, దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి, నిర్మాత సురేష్ కొండేటి, భాస్కర భట్ల కూర్చుని చర్చించి మరో రెండు పాటలకు సంబంధించిన ట్యూన్లను ఖరారు చేశారు.

E357bbff C062 46c2 Aa65 1c6079c90fdb

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ... ప్రస్తుతం మళ్లీ పాటల ట్రెండ్ వచ్చిందన్నారు. ‘ఒకప్పుడు సినిమా బాగుండక పోయినా పాటల కోసమైనా సినిమాలను మళ్లీమళ్లీ చూసేవారు. అలా చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో కొంతకాలం పాటలను అదనపు భారంగా భావించారో ఏమోగాని పాటలు లేకుండానే సినిమాలు వచ్చాయి. సినిమాలో పాటల సంఖ్య 6 నుంచి నాలుగుకు పడిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని లిరికల్ వీడియోల ట్రెండ్ వచ్చింది. ఆమధ్య వచ్చిన ‘గీతా గోవిందం’ దగ్గర నుంచి ఈ లిరికల్ వీడియోల ట్రెండ్ బాగా ఎక్కువైంది. ట్రైలర్లకన్నా ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి.

ఇటీవల ‘అల వైకుంఠపురం’లో పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అందుకే మేము కూడా పాటల మీద ప్రత్యేక శ్రధ్ద పెట్టాము. ఒకప్పుడు ఆడియో విడుదల ట్రెండ్ ఉండేది. ఇప్పుడు అది పోయి సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే పాటలు జనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇది శుభపరిణామం. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు పాటలే సినిమాని బతికిస్తున్నాయి అని నా అభిప్రాయం’అని వివరించారు. ‘పాటలకు మాస్ మసాలా ఎలా జోడించాలో భాస్కరభట్ల రవికుమార్ కు బాగా తెలుసు. పైగా నాతో ఉన్న స్నేహం కారణంగా నా పాటల విషయంలో తను ప్రత్యేక శ్రద్ధతీసుకుని ఈ పాటలు రాస్తున్నారు’ అని చెప్పారు. ఈ సినిమాలో ఉండేది నాలుగు పాటలే అయినా నలభై ఏళ్ల పాటు గర్తుండేలా ఈ పాటలను రూపొందిస్తున్నామన్నారు.

సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ... తాను ఇంతకుముందు కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలకు సంగీతం అందించినట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా తనకిది మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు.

దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మల్టీ జోనర్ సినిమాగా ఇది తెరకెక్కుతుందని చెప్పారు. ఒక పాటను సురేష్ ఉపాధ్యాయ రాశారని, రెండు మాస్ పాటలను భాస్కరభట్ల రవికుమార్ తో రాయిస్తున్నట్లు చెప్పారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఈ సినిమాలో ఉంటాయని వివరించారు.

893cb219 A6c3 4d48 9b53 6533f7e44d39

Next Story
Share it