కరోనాతో టాలీవుడ్ అమీతుమీ
By సుభాష్ Published on 4 Sep 2020 7:54 AM GMTకరోనా కారణంగా కుదేలైన రంగాల్లో సినిమా ఫీల్డ్ ఒకటి. మిగతా రంగాలు లాక్ డౌన్ నుంచి త్వరగానే విముక్తి పొందాయి. యధావిధిగా అన్ని వ్యాపారాలూ జరిగిపోతున్నాయి. జనాలు ఏమేర డబ్బులు బయటికి తీస్తున్నారు.. వ్యాపారం ఏ మేర నడుస్తోంది అన్నది పక్కన పెడితే.. కొన్ని నెలలుగా కనీసం వివిధ రంగాల్లో మళ్లీ పని అయితే నడుస్తోంది. ఉపాధి లభిస్తోంది. కానీ సినీ రంగంలో మాత్రం ఆరు నెలలుగా అన్నీ బందే. సినిమాను నమ్ముకున్న వారి ఇబ్బందులు మామూలుగా లేవు. థియేటర్ ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. షూటింగుల్లేక సినీ కార్మికుల పరిస్థితీ దయనీయంగా మారింది. మళ్లీ షూటింగ్‌లు చేసుకోవడానికి రెండు నెలల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించినా.. కరోనా ఉద్ధృతి కారణంగా ఎక్కడా చిత్రీకరణలు జరిపే అవకాశం కనిపించలేదు.
ఐతే ఇలా ఎంతకాలమని ఆగుతారు. కరోనా ప్రభావం ఎలా ఉన్నా సరే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు చేయాలని డిసైడైపోయారు. ఈ విషయంలో ముందుగా కదలిక తీసుకొచ్చింది ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ టీమే. సెప్టెంబరు రెండో వారం నుంచి తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభిస్తున్నామని ఆ చిత్ర బృందం ప్రకటించగానే మిగతా వాళ్లూ కదిలారు. వారి కంటే ముందే షూటింగ్‌లుె మొదలుపెట్టేశారు. అంత పెద్ద సినిమా టీమే కదిలినపుడు మనకేంటి అనుకున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది. సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణ ఆరంభించాడు. నాగార్జున సైతం ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. చిరు సినిమా ‘ఆచార్య’తో పాటు బాలయ్య కొత్త చిత్రం షూటింగ్ కూడా ఇంకొన్ని రోజుల్లోనే మొదలవుతుందట.
ఐతే ఇలాగే రెండు నెలల కిందట టీవీ షూటింగ్‌లు పున:ప్రారంభించగా.. కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆందోళన నెలకొంది. అలాగని వాళ్లు భయపడి పని ఆపేయలేదు. సినిమా వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బంది తప్పకపోవచ్చు. కొందరు కరోనా బారిన పడొచ్చు. ఐతే ఇంతకుముందులా వైరస్ అంటే మరీ బెదిరిపోయే పరిస్థితి లేదు. ఉన్నంతలో జాగ్రత్తలు పాటిస్తూ.. ఎవరైనా కరోనా బారిన పడితే తగు ఏర్పాట్లు చేసి పని నడిపించాల్సిందే అని డిసైడైపోయారు సినీ జనాలు. మొత్తంగా టాలీవుడ్ అంతా కలిసి కరోనాను ఢీకొట్టడానికే సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.