సినీ జనాల్లో ‘వి’ టెన్షన్

By సుభాష్  Published on  4 Sep 2020 6:35 AM GMT
సినీ జనాల్లో ‘వి’ టెన్షన్

ఇంకొన్ని గంటల్లోనే ‘వి’ సినిమా విడుదల కాబోతోంది. టాలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న తొలి పెద్ద సినిమా ఇదే. ఇప్పటిదాకా తెలుగులో చిన్న చిత్రాలు మాత్రమే ఇలా రిలీజయ్యాయి. ‘వి’ స్థాయి సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఇలా ఓటీటీలో చూస్తామని ఎవరూ ఊహించలేదు. ఐతే నిర్మాత దిల్ రాజు ఈ డీల్ ఓకే చేయడానికి ముందు చాలానే ఆలోచించాడు. థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేసిన సినిమాను ఓటీటీలో వదలడమేంటని ఆయన బృందంలోని వారే అభ్యంతర పెట్టారు. మరోవైపు ఎగ్జిబిటర్ల నుంచి కూడా ఆయన ఒత్తిడి ఎదుర్కొన్నారు. కాబట్టే ఇంత కాలం ఆగాల్సి వచ్చింది. కానీ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశాలు లేకపోవడం, తెరుచుకున్నా మామూలుగా నడవడానికి సమయం పట్టేలా ఉండటంతో రాజు ‘వి’ని ప్రైమ్ వాళ్లకు అమ్మేశాడు. ఇదొక కీలకమైన మలుపుగా భావిస్తున్నారు.

ఇప్పుడు ‘వి’ సినిమాకు డిజిటల్ మీడియంలో ఎలాంటి స్పందన వస్తుందనే విషయమై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. దాన్ని బట్టి ఇండస్ట్రీలో పరిణామాలు వేగంగా మారిపోవచ్చు. థియేటర్లలో రిలీజయ్యే సినిమాకు వచ్చే వసూళ్లను బట్టి దాని ఫలితాన్ని అంచనా వేస్తాం. కానీ ఓటీటీల్లో అందుకు అవకాశం లేదు. ఈ సినిమాను ఎంత మంది వీక్షించారు. కొత్తగా ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయి. యాప్‌ డౌన్‌లోడ్స్ ఏమేర పెరిగాయి.. అలాగే సోషల్ మీడియాలో దీని మీద ఎంత చర్చ జరిగింది. మీడియా ఈ సినిమా గురించి ఏం రాసింది, ఏం చర్చించింది అన్నదాన్ని బట్టి దాని సక్సెస్‌ను అంచనా వేయొచ్చు. విడుదలయ్యాక వారం రోజుల్లో ట్రెండ్స్‌ను బట్టి ఒక అంచనా వస్తుంది. ‘వి’కి మంచి క్రేజే ఉన్న నేపథ్యంలో సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. అన్ని పారామీటర్లను అందుకుని ‘డిజిటల్ హిట్’గా నిలుస్తుందని.. తద్వారా ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు స్పందన బాగుంటే మున్ముందు మరిన్న మీడియం, పెద్ద రేంజ్ సినిమాలు ఓటీటీల్లో నేరుగా రిలీజ్ కావచ్చు. లేదంటే మాత్రం ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఆచితూచి వ్యవహరించొచ్చు.

Next Story