9న జగన్‌తో టాలీవుడ్‌ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం.. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 8:16 AM GMT
9న జగన్‌తో టాలీవుడ్‌ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం.. అయితే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇబ్బందులు, షూటింగ్స్‌ను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశం పై టాలీవుడ్‌ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితో భేటి కానున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దీనిపై సినీ నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశానికి నందమూరి బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెప్పారు. కానీ మరుసటి రోజు పుట్టిన రోజు కావడం వల్ల తాను హాజరుకాలేనని బాలకృష్ణ తెలిపారని కల్యాణ్ అన్నారు. ఇదే సందర్భంలో చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు.

చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. కాగా ఈ బేటీకి తనని ఎవరూ పిలవలేదని బాలకృష్ణ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో లుకలుకలు బయటపడ్డాయి.

Next Story