ఇదో వింత క‌థ‌.. ప్రియురాలితో భ‌ర్త‌కు పెళ్లి చేసిన భార్య‌.. ముగ్గురూ క‌లిసే ఉంటార‌ట‌..!

Wife Helped her husband marry his lover.సాధార‌ణంగా ఏ మ‌హిళ అయినా త‌న భ‌ర్త‌ను మ‌రో స్త్రీతో పంచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌దు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 7:17 AM GMT
ఇదో వింత క‌థ‌.. ప్రియురాలితో భ‌ర్త‌కు పెళ్లి చేసిన భార్య‌.. ముగ్గురూ క‌లిసే ఉంటార‌ట‌..!

సాధార‌ణంగా ఏ మ‌హిళ అయినా భ‌ర్త‌ను మ‌రో స్త్రీతో పంచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌దు. త‌న నుంచి భ‌ర్త దూరం కాకుండా ఉండేందుకు ఏం చేస్తున్నాడా అని ఎప్పుడు ఓ కంట క‌నిపెడుతూ ఉంటుంది. ఒక వేళ పరాయి స్త్రీలతో భ‌ర్త‌కు సంబంధాలుంటే నానార‌భ‌స‌ చేసి భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన ఘ‌ట‌న‌లు చూశాం. అయితే.. ఓ మ‌హిళ త‌న భ‌ర్త మ‌రో యువ‌తిని ఇష్ట‌ప‌డ్డాడు అని తెలిసి ద‌గ్గ‌రుండీ మ‌రీ రెండో పెళ్లి చేసింది. ఈ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లాలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

డ‌క్కిలి మండలంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చ‌దువుకున్నాడు. టిక్‌టాక్ వీడియోతో మంచి గుర్తింపు పొందాడు. టిక్‌టాక్‌లో అత‌డికి తొలుత విశాఖ‌కు చెందిన ఓ యువ‌తితో ప‌రిచయం ఏర్ప‌డింది. ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డంతో ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నా.. తర్వాత ఇద్దరూ విడిపోయారు.

కొద్దిరోజులు తర్వాత ఆ యువకుడికి టిక్‌టాక్‌లోనే కడపకు చెందిన మరో యువతితో పరిచయం ఏర్ప‌డింది. ఇద్ద‌రూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. హాయిగా త‌మ జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఇంతలో తొలుత ప్రేమించిన విశాఖపట్నం ప్రియురాలు తిరుపతిలోని ప్రియుడి ఇంటికి వ‌చ్చింది. త‌న ప్రియుడికి ఇప్ప‌టికే పెళ్లి జ‌రిగింద‌ని తెలిసి బాధ‌ప‌డింది. ఆ యువ‌తి అక్క‌డితో ఆగిపోలేదు.

అత‌డి భార్య‌ను క‌లిసి మాట్లాడింది. తాను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యాన్ని చెప్పింది. తాను ఇక్క‌డే ఉంటాన‌ని, ముగ్గురం క‌లిసే ఉందామ‌ని న‌చ్చ‌జెప్పింది. ఆ యువ‌కుడి భార్య‌ తొలుత అయోమ‌యానికి గురి కాగా.. త‌రువాత తేరుకుంది. చివ‌రికి ముగ్గురు క‌లిసి ఉండ‌డానికి ఒప్పుకుంది. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. తానే ద‌గ్గ‌ర నుండి భ‌ర్త‌కు, అత‌డి ప్రియురాలికి బుధ‌వారం పెళ్లి చేసింది. ఈ విష‌యం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా చర్చనీయాంశమైంది.

Next Story